వేదాలని ఒంటపట్టించుకున్న ఓ వెయ్యి మంది వేదబ్రాహ్మణులతో, 10 రోజులపాటు ఆగకుండా ప్రత్యేక పూజలు, యజ్ఞ, యాగాలు జరిపించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలోని గజ్వెల్‌కి సమీపంలోని తన సొంత ఫార్మ్‌హౌజ్ ఈ యాగానికి వేదిక కానుంది. దుర్గామాత ఆశీస్సుల కోసం జరపనున్న ఈ యాగంలో వెయ్యి మంది వేదబ్రాహ్మణులు 100 హోమగుండాలతో, 700 మంత్రాల్ని పదివేలసార్లు పఠిస్తూ పూజలు నిర్వహిస్తారు. శత్రు సంహార, రాజ వశీకరణ వంటి యాగాలు ఈ ఆయుత చండీయాగంలో భాగం. ఈ ప్రత్యేక ప్రార్థనల బాధ్యతని కర్ణాటకలోని శృంగేరీ పీఠానికి చెందిన వేదపండితులకు అప్పగించారు. శత్రువులపై పైచేయి సాధించేందుకు రాజుల కాలంలోనూ ఈ యజ్ఞాలు నిర్వహించేవారని చెబుతున్నారు వారిలో ఒకరైన భానుప్రకాష్ శర్మ. గతంలో రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ(1976), దేవేగౌడ(1999), రాజీవ్ గాంధీలు(1987) ఈ యాగాన్ని నిర్వహించారని శర్మ గుర్తు చేసుకున్నారు. చండీయాగం నిర్వహణలో శృంగేరీ పీఠాధిపతులు అద్భుతమైన నైపుణ్యం కలవారని చెబుతుంటారు. అందుకే కేసీఆర్ వారిని ఈ యాగానికి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈరోజుల్లోనూ ఆయన ఈ యజ్ఞ, యాగాలు చేయాలని నిర్ణయించడానికి కారణం ఏంటని ఆరాతీయగా.. ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఎంత చేసినా అవి తనకు మంచి పేరుని తీసుకురావడం లేదని కేసీఆర్ ఆవేదన చెందుతున్నారని.. అటువంటి మానసిక ఆందోళనలే బహుశా ఈ నిర్ణయానికి కారణమై వుండవచ్చని రెవిన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్ ఉద్యోగి అభిప్రాయపడ్డారు. గతంలోనూ కేసీఆర్ ఈ తరహా యాగాలు నిర్వహించడాన్ని పార్టీ, అధికార వర్గాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాయి.