కార్డాన్ సెర్చ్ లో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సోదాల్లో వెట్టి చాకిరీ మాఫియా ఉదంతం బయటపడింది. పాతబస్తీ లోని భవానీ నగర్ లో ముమ్మర సోదాలకు దిగిన సౌత్ జోన్ పోలీసులకు వెట్టిచాకిరీలో మగ్గుతున్న 250 మంది బాలకార్మికులు కనిపించారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు పూర్తి వివరాలు రాబట్టేందుకు రంగంలోకి దిగారు. వీరంతా బీహార్ కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. పిల్లలను అక్రమంగా తరలించడంతోపాటు వారితో బలవంతంగా చాకిరీ చేయిస్తున్న ముఠా ఉదంతం ఈ సందర్భంగా వెలుగు చూసింది. బీహార్ నుంచి తీసుకొచ్చిన పిల్లలతో కొందరు వ్యక్తులు గాజుల తయారీ, చెప్పుల తయారీ కంపెనీలలో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాలల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కొన్ని సంస్థలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, బాలలను అక్రమంగా తరలించిన వారి కోసం గాలింపు చేపట్టారు.