నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో ముష్కరుల తూటాలకు తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ సిద్దయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత మూడు రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న సిద్దయ్య మృతి నల్గొండ పోలీసులలో తీవ్ర విషాదాన్ని నింపింది. దుండగుల కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకు పోయిన విషయం తెలిసిందే. దాంతో 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్‌ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్ వల్ల ప్రా ణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలు కన్న సిద్దయ్య 2012 బ్యాచ్ ఎస్‌ఐగా ఎంపికై నల్గొండ జిల్లాలోని మోత్కుర్ ఎస్‌ఐగా వచ్చారు. ప్రస్తుతం ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామేశ్వరానికి చెందిన ధరణీతో గతేడాది వివాహం అయింది. ఓ వైపు తన భార్య ప్రసవించిన ఆస్పత్రిలో, అదే సమయంలో ఆయన ప్రాణాలు వదలటం పలువురిని కంటతడి పెట్టించింది. చివరకు తన బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయారు. కాగా ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సిద్ధయ్య ప్రాణాలకు తెగించి పోరాడారని, ఆయనది వీరమరణమని నివాళులు అర్పించారు. పోలీసుల అంకితభావానికి సిద్ధయ్య ప్రతీకని కేసీఆర్ కొనియాడారు. ఆయనకు నివాళిగా రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.