టీటీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై ఓ వైపు చర్చ సాగూతూనే ఉండగా మరోవైపు తాజాగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒక్కరోజు వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై సోమవారం సభలో అలజడి సృష్టించిన కాంగ్రెస్ నేతలు తిరిగి మంగళవారం సభ ప్రారంభం కాగానే అదే పద్ధతిని కొనసాగించారు. ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై అనర్హత వేటు వేయాలని నినాదాలు చేస్తూ స్పీకర్ ను డిమాండ్ చేశారు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని ఆమోదించిన స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో డీకే అరుణ, పువ్వాడ అజయ్ కుమార్, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పద్మావతి తదితరులు ఉన్నారు.