సాధారణంగా పుష్కరాలు, జాతరలు, పండగలు జరిగినప్పుడు రవాణా సదుపాయాలను పెంచి ఆదాయం భారీగా రాబట్టుకోవటం ప్రభుత్వాలకు అలవాటు ఉన్నదే. అదనపు బస్సులతోపాటు ప్ర్యతేక సర్వీస్ లను నడిపి కోట్లకు కోట్లు ఆదాయాల లాభాలను ఖజానాకి జమచేస్తారు. అయితే ఆసియాలోనే అతిపెద్ద పండగా పేరొందిన మేడారం జాతర ద్వారా తెలంగాణ ఆర్టీసీకి కోట్లలో నష్టం వాటిల్లిందట.
నిజానికి మేడారం ద్వారా ప్రతిసారీ ఆర్టీసీకి లక్షల నుంచి కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఖజానాకు చేర్చుకుంటుంది. కానీ ఈసారి మేడారం జాతర మాత్రం ఆర్టీసీకి భారీగా నష్టాలనే మిగిల్చినట్టు తెలుస్తోంది. గత జాతర సందర్భంలో 16 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ఆర్టీసీ, ఈ సంవత్సరం 18 లక్షల మందిని చేరవేసింది. అయితే ఆ సదుపాయాలను కల్పించేందుకు అంతకుమించిన ఖర్చు నమోదవడంతో నష్టం తప్పలేదు.
ప్రత్యేక ప్రయాణాల కోసం వివిధ డిపోల నుంచి బస్సులు తెప్పించగా, దాదాపు హైదరాబాద్ సిటీ నుంచే 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు వేతనాలు, వారి వసతి తదితరాల ఖర్చు ఆర్టీసీపై అదనపు భారమైంది. ఏసీ, హైటెక్ బస్సుల రిజర్వేషన్లకు పెద్దగా ఆదరణ రాకపోవడం కూడా నష్టాన్ని పెంచింది. ముఖ్యంగా జాతర కోసం వేసిన సర్వీసుల మూలాన సిటీలో ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. అంతేకాదు బస్సులు పూర్తిగా నిండకుండానే నడిపించారన్న ఆరోపణలూ వచ్చాయి. మొత్తం మీద ఈ దఫా మేడారం జాతర రద్దీ పెరిగినప్పటికీ తెలంగాణ ఆర్టీసీకి మాత్రం విమర్శలతోపాటు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది.