సోషల్ మీడియాను మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుకుంటున్నారనడానికి మరో ఉదాహరణ. ఓ యువకుడు అదే ఊర్లో ఉన్న ఓ యువతి స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో సీక్రెట్ గా ఫోటోలు తీశాడు. అంతటితో ఆగక వాట్సాప్ లోని ఓ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. దీంతో సదరు యువకుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళ్లితే... నిజామాబాద్ కు కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన కుంటాలపల్లి నరేష్ తన సెల్‌ఫోన్‌లో అదే గ్రామానికి చెందిన ఓ యువతి నగ్న చిత్రాలను వాట్సాప్ మెసెంజర్ ద్వారా పలు గ్రూపులకు అప్‌లోడ్ చేశాడు.
విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అతన్ని దగ్గర్లోని ఓ ఆలయానికి పిలిపించి నిలదీశారు. దీంతో ఫొటోలు తానే తీశానని, వాట్సాప్‌లో మాత్రం అప్‌లోడ్ చేయలేదన్నాడు. దీంతో ప్రజలు ఆగ్రహాంతో నరేష్‌ను ఆలయం నుంచి గ్రామపంచాయతీ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించాలని భావించారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం బయట రెడీగా ఉన్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులు కోరగా, నడిపించుకుంటూ గ్రామపంచాయితీ వద్దకు తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. దీంతో వారి నడుమ కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే చివరికి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని ఎస్‌ఐ ప్రభాకర్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.