ప్రభుత్వం తరపున ఇచ్చే సినిమా అవార్డులకు నంది పేరును తొలగించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకుగానూ సీఎం కేసీఆర్ మూడు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పేరిట అవార్డులను కొనసాగిస్తే తమకు సంబంధం లేదని, తాము మాత్రం తెలంగాణ తరపున కళాకారులను ఘనంగా సత్కరిస్తామని తలసాని తెలిపారు. అంతకు ముందు టాలీవుడ్ పెద్దలు మంత్రితో భేటీ అయ్యారు. త్వరలో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు మంత్రిని కోరారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. దగ్గుబాటి సురేష్ బాబు, కే.ఎస్.రామారావు తదితరులు మంత్రితో భేటీ అయిన వారిలో ఉన్నారు.