బహుముఖ ప్రజ్ఞాశాలి, అసమాన పాలనా సమర్థుడు, ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హతలున్న ఒక తెలుగు వ్యక్తి, అనుకోకుండానే ప్రధాని అయ్యాడు. ఆ పదవితో దేశానికి వన్నె తెచ్చాడు. దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించాడు... ఇదెవరూ కాదనలేని సత్యం. కానీ ఆ సత్యాన్ని ఒప్పుకునే తెలుగువాడే లేడు. ఫలానా దేశీయుడు ఆ ఫీట్ సాధించాడు... ఫలానా వాడు ఈ ఫీట్ ను సాధించాడు అని చెప్పుకోవటం తప్పించి, మన వాళ్ళ గొప్పదనాన్ని మనమే గుర్తించలేని స్టేజీలో మనం ఉన్నామన్నది మాత్రం ఒప్పుకొవాలి.
పీత కథ గురించి మీకు తెలిసే ఉండొచ్చు... కానీ, మరోక్కసారి ప్రస్తావించుకుందాం... ఒక కొట్టులో యజమాని ఓ గిన్నెలో పీతలను ఉంచుతాడు. కానీ, దానిపై మూతను ఉంచడు. ఆ షాపు కొచ్చిన ఓ వ్యక్తి దానిని ఎందుకలా తెరిచి ఉంచావ్... అన్నీ పారిపోతే అని అడుగుతాడు. దానికి యజమాని నవ్వుతూ... అవన్నీ తెలుగు పీతలు. ఒకవేళ బయటికి పోదామనుకున్నా... ఒకదానిని మరోకటి వెళ్లనీయకుండా లోపలికి లాగేస్తాయి అని బిగ్గరగా నవ్వుతూ చెబుతాడు. ఇది మనకు సరిగ్గా సరిపోయేదే.
ఓ ప్రధాని పదవిలో పనిచేసిన వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వకపోగా, ఎప్పటికప్పుడూ అవమానిస్తూనే వస్తున్నారు. జయంతి, వర్థంతి రోజుల్లో కనీస ప్రస్తావన కూడా లేకుండా ఇప్పటిదాకా ఆయా ప్రభుత్వాలు తొక్కేస్తూ వస్తున్నాయి. ఓ ప్రాంతానికి చెందిన వాడే, అందుకే తొక్కేసారు అని ఉద్యమ సమయంలో ప్రతీఒక్కరు పీవీని స్మరించుకున్నారు. స్మారక స్థూపంపై ఒక అడుగు ముందుకేసి రాజకీయాలు కూడా చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చింది. వచ్చి ఏడాది అయిపోయింది. ఇప్పటికైనా గుర్తిస్తారా మరి అన్నది ప్రశ్నగా ఉండేది.
తాజాగా దేశం తరపున అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు పేరును ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాకు సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం కూడా తెలిపింది. ఈయనతోపాటు ప్రొఫెసర్ జయశంకర్, విద్యావేత్త రాంరెడ్డి పేర్లను పద్మవిభూషణ్, చుక్కారామయ్య పేరును పద్మశ్రీకి ప్రతిపాదిస్తూ లిస్ట్ ను పంపిందట. మోమొరియల్ పై అప్పట్లో కాస్తో కూస్తో మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఆయనకు ఆ అవార్డును ప్రకటిస్తే సముచిత గౌరవం ఇచ్చినట్టే... థాంక్స్ టూ టీ గవర్నమెంట్.