రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్ ఇరురాష్ర్టాలకు ఉమ్మడి భవన్‌గా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా భవన్‌ను నిర్మించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట. గత సెప్టెంబర్‌లో ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు జాతీయ భవనాల నిర్మాణ సంస్థ (ఎన్.బీ.సీ.సీ) లిమిటెడ్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. కొత్త భవన్ నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని కోరారు. ఎన్.బీ.సీ.సీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీల్లో ఒకటిగా పేరొందింది. చంద్రబాబు విజ్ఞప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంస్థ కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముసాయిదా ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్ 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికీ ఇందులో పది నుంచి 11 ఎకరాలు ఖాళీగానే ఉంది. మిగిలిన స్థలంలోనే ప్రస్తుత నిర్మాణాలు ఉన్నాయి. ఇక, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం స్థలంలో ఆంధ్రప్రదేశ్‌కు 10.6 ఎకరాలు, తెలంగాణకు 8.4 ఎకరాల భూమి చెందుతుంది. అయితే, ఎవరు ఎంత తీసుకోవాలి, ఉన్న భవనం సంగతేంటనే అంశాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ కూర్చుని చర్చించుకోవాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం పాత భవనాన్ని తొలగించి, మొత్తం భూమిని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకుని వేర్వేరుగా రెండు కొత్త భవన్‌లను నిర్మించుకునే ప్రతిపాదనకు తాము సిద్ధమేనని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ అవసరం లేకుండా ఉన్న భవన్ ను తెలంగాణకే కేటాయించి ఏపీకి కొత్త భవన్ ను నిర్మించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే భవనంలో దాదాపు 200 గదులతో పాటు, 2,000 మంది కూర్చోనగలిగే కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారట.