ఊరికే సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెట్టినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా చెప్పండి. వన్యప్రాణులను హింసించరాదన్న నిబంధనలను తుంగలోతొక్కి... అత్యుత్సాహాంతో తాబేలు పైకి ఎక్కి చిత్రాలు తీసుకోవటమేకాక వాటిని ఫేస్ బుక్ లో ఉంచిన ఆ యువకుడు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. చాంద్రయణగుట్ట జహనుమాకు చెందిన ఫజల్ షేక్ గత ఏడాది మేలో నెహ్రూ జూపార్కుకు వెళ్లాడు. అక్కడ జంతు రక్షకులు లేని సమయంలో తాబేలుండే ప్రాంతంలోకి దూకి దానిపై నిలబడి ఫోటోలు దిగాడు. అంతటితో ఆగకుండా నిప్పుకొడి, ఈము పక్షుల ఉండే ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించి వాటికి ఆహారాన్ని అందిస్తున్నట్లు చిత్రాలు తీసుకుని, వాటిని కూడా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. ఇక వీటిని చూసిన జూపార్క్ అధికారులు ఓ యువతి ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టి నిందితుడిని ట్రాప్ చేశారు. తెలివిగా అతగాడి పూర్తి వివరాలను, అడ్రస్ ను రాబట్టారు. జూపార్క్ క్యూరేటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి ఫజల్ ను అదుపులోకి తీసుకున్నారు.