అతడో తెలుగు టీచర్. ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా ప్రేమ పేరుతో ఓ వివాహితకు దగ్గరయ్యాడు. అంతటితో ఆగక ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్లితే... అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో మల్కేపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో తెలుగు టీచర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి సామాజిక మాధ్యమాలు వాడి అమ్మాయిలను ట్రాప్ చేయటం అలవాటు. ఇదే క్రమంలో అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయట కూడా. ఇక ఈ మాష్టార్ కన్ను హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ ఎస్సైగారి భార్య మీద పడింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న అతడు ఆమెతో ప్రేమ వ్యవహారం నడపడమే కాదు. ఏకంగా ఆమెను తెచ్చి మంచిర్యాలలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశాడు కూడా. దీంతో ఆ అధికారి తన భార్య కనిపించటం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో అసలు విషయం బయటపడగా నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ముక్కు మోహం తెలియని వ్యక్తులతో సోషల్ మీడియా పరిచయాలు యువతుల జీవితాలనే కాదు... ఇలా పండంటి కాపురాలు కూడా కూలుస్తున్నాయన్నమాట. జాగ్రత్త సుమీ!