వచ్చే ఎన్నికల నాటికల్లా తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు. సెస్‌భవన్‌లో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో పార్టీ సభ్యత్వాల నమోదుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించను. గురువారం మా కోర్‌కమిటీ ఓ వ్యూహాన్ని రచించింది. భవిష్యత్తులోనూ వ్యూహరచనను కొనసాగిస్తాం. వచ్చే నాలుగేండ్లలో తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదుగుతుందో మీరే చూస్తారు’’ అని అమిత్ షా అన్నారు. తెలంగాణలో 35 లక్షల సభ్యత్వాలు నమోదుచేయించడమే లక్ష్యంగా పెట్టుకొన్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నదని, గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి 22 శాతం ఓట్లు వచ్చాయని షా చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపిస్తున్నామన్నది వాస్తవం కాదని, అన్ని రాష్ర్టాలు తమకు సమానమేనని అన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఆ రాష్ట్రశాఖకే వదిలేస్తున్నామని చెప్పారు.