మరో ముగ్గురు సైకిల్ దిగి కారులోకి

January 17, 2015 | 03:50 PM | 38 Views
ప్రింట్ కామెంట్

కారెక్కనున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణలో తేదేపాకు మరో భారీ షాక్ తగలనుందని టాక్. ఇప్పటికే పలువురు తేదేపా ఎమ్మెల్యేలు పార్టీ వీడి తెరాసలో చేరారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు తెరాసలో చేరతారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో ఉన్న వారు తమకు అవకాశం దక్కదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కొత్తగా 34 నియోజకవర్గాలు పెరుగుతాయని అందువల్ల అందరికి అవకాశాలు వస్తాయని ఆయన చెపుతున్నారు. ఇక హైదరాబాద్‌లో పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీ ఇక్కడ బలపడిందని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్టు సమాచారం. ఇక కొత్తగా తెరాసలో చేరే వాళ్లలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. అయితే వీరు ముగ్గురు తేదేపాకు చెందిన వారే కావడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీలలో ఒకరు ఇక గ్రేటర్‌లోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకుంట్ల ప్రకాష్‌గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలకు తెరాస అభివృద్ధి పనులను ఎరవేస్తున్నట్టు సమాచారం. ఇక ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య పేరు వినిపిస్తోంది. అయితే ఆయన గతంలోనే పార్టీ మారతారని వార్తలు వచ్చినా వాటిని ఖండించాడు. అయితే కేసీఆర్ అన్నట్టు సండ్ర వీరయ్య పార్టీ మారతారా లేదా ఆ జిల్లాలో మిగిలి ఉన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేరతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి సీఎం కేసీఆర్ స్వయంగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరతారని ప్రకటించడంతో మళ్లీ దూకుడు రాజకీయాలు మొదలయ్యాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ