ఇప్పటివరకు కశ్మీర్, సిమ్లా రకాల ఆపిల్స్ ను రుచి చూసిన మనల్ని, మరో రెండేళ్లలో తెలంగాణ ఆపిల్స్ పలకరించనున్నాయి. తెలంగాణలో ఆపిల్స్ సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ) శాస్త్రవేత్త డాక్టర్ వీరభద్రరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కీరామేరి ప్రాంతంలో ఆపిల్ సాగు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. కెరెమెరి ప్రాంతంలో శీతాకాలంలో 5 నుంచి 7 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఆపిల్ పంట సాగుకు వాతావరణ పరిస్థితులు ఎంత మాత్రం అనుకూలంగా ఉంటాయో అధ్యయనం చేసి, జనవరిలో రైతులతో కొన్ని మొక్కలు నాటిస్తామని ఆయన చెప్పారు.