సముద్రమే లేదు కదా... ఓడరేవు ఏంటా అని అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ త్వరలో తెలంగాణ రాష్ర్టానికి ఒక ఓడరేవు రానుంది. తీరంలేని రాష్ర్టానికి నౌకాశ్రయాలను ఊహించలేని పరిస్థితుల్లో ఎగుమతులు, దిగుమతులకోసం ఒక శాటిలైట్ పోర్టు (డ్రై పోర్టు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. గోదావరి తీర ప్రాంతంలో రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న ఒక ప్రాంతంలో ఈ శాటిలైట్ పోర్టును నెలకొల్పుతారు. దీని ద్వారా చిన్నపాటి సరుకు రవాణా నౌకలు నది గుండా ప్రయాణించి ఏపీలోని ఏదైనా ఒక ప్రధాన నౌకాశ్రయానికి ప్రయాణించేలా మార్గం ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఎగుమతుల రంగానికి కొత్త ఊపునిచ్చే ఈ నిర్ణయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రకటించారు. అంతేకాదు ఈ పోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందంట. సముద్రం తీరంలేని రాష్ర్టాల్లో శాటిలైట్ పోర్టులను అభివృద్ధి చేయాలని భావించిన కేంద్రం అందుకు 12 ప్రాంతాలను అనువైనవిగా గుర్తించింది. వీటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. నౌకలు తిరగడానికి వీలుగా కనీసమైన నీటిమట్టం శాటిలైట్ పోర్టు మొదలు సముద్రతీరంలో ఉండే పోర్టు వరకు అన్ని సమయాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటికోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడంతోపాటు కొన్ని చోట్ల అదనంగా బ్యారేజీలు నిర్మించి నీటి మట్టాన్ని అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ోర్టును ఎక్కడ నిర్మించాలో నిర్ణయం తీసుకున్నాకే వ్యయం, ఎంత కాలంలో నిర్మిస్తారు తదితర అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.