ప్రస్థుతం తెలంగాణాను సర్కారు విద్యుత్ సంక్షోభం ఎంతలా ఇబ్బంది పెడుతుందన్నది తెలిసిందే. ఈ మధ్య కాలంలో కేంద్రంతో వీలైనంత సన్నిహితంగా ఉంటూ.. తమ పనులు ఒక్కొక్కటీ చేయించుకుంటున్న కేసీఆర్ సర్కారు.. మరో లబ్థిని కేంద్రం నుంచి పొందనుంది. తెలంగాణను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విద్యుత్తు సంక్షోభం నుంచి కేసీఆర్ సర్కారును బయటపడేసేందుకు కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎవరికి కేటాయించని కోటాలో దాదాపు 200 మెగావాట్ల విద్యుత్తు కేటాయించినట్లు చెబుతున్నారు. అయితే.. ఇందులో 150 మెగావాట్లను తమకే కేటాయించాలని తమిళనాడు సర్కారు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కోరింది. అయితే.. వారి విన్నపాన్ని పెద్దగా పట్టించుకోని కేంద్రం.. కేసీఆర్‌కు పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై తమిళసర్కారు అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కూడంకుళం ప్రాజెక్టులో రెండో యూనిట్ పరిధిలో ఎవరికి కేటాయించని విద్యుత్తులో 150 యూనిట్లు తమకే ఇవ్వాలని తమిళనాడు సర్కారు కోరుతోంది. తీవ్ర విద్యుత్తు కొరతతో తమిళనాడు సర్కారు తల్లడిల్లిపోతోంది. ఆ సమస్యకు పరిష్కారంగా తమకే కూడంకూళం విద్యుత్తును కేటాయించాల్సిందిగా కోరుతున్నారు. అయితే.. కేంద్రం మాత్రం తమిళనాడుకు కాకుండా కేసీఆర్ సర్కారుకు కేటాయించాలనుకోవటంపై తమిళనాడు సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది.