తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి అలియాస్ కాకా సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి 7సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానే కాక ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలందించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు వివేక్ (మాజీ ఎంపీ), వినోద్ లు ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత కొద్ది కాలంగా ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో ఆయన చికిత్సపొందుతున్నారు. కాగా, ఈ సీనియర్ నేత మృతికి తెలంగాణ, ఏపీ సీఎంలు కే.చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసేంతవరకు కన్నుమూయనని ప్రతిన బూనిన ఈ కురువృద్ధుడు అన్న మాట ప్రకారం స్వరాష్ట్ర కల సాకారమయ్యాకే మరణించారు. కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, టీ కాంగ్రెస్ ఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత జగన్, కాకా మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.