ఈ-కామర్స్ రంగంలో మరో కొత్త ఒరవడిని సృష్టించింది నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్ సంస్థ. మొట్టమొదటిసారిగా ఆన్ లైన్లో బంగారు, వెండి ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ ఎన్ సిల్వర్.ఇన్ పేరిట వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు ముఖ్యఅతిథిగా, నటి జయసుధ కపూర్, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవితారాజశేఖర్ గౌరవఅతిథులుగా హాజరై లాంఛ్ చేశారు. అనంతరం అతిథులంతా మాట్లాడుతూ కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్న నీహార్ సంస్థను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నీహార్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ బీఎస్ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ... మార్కెట్ ప్లేస్ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని తెలిపారు. తయారీ కంపెనీలను మాత్రమే పోర్టల్ ద్వారా బంగారు నాణేలు, పెండెంట్లు, వెండి నాణేలు, ఆభరణాలను విక్రయించేందుకు అనుమతిస్తాం. నాణ్యతలో రాజీ పడకూడదన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాల్లో ఉన్న కస్టమర్లూ ఆర్డరు ఇవ్వొచ్చు. ఉత్పత్తుల ధర రూ.500 నుంచి ప్రారంభం. ప్రస్తుతం 500 వరకు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. కరీంనగర్ ఫిలిగ్రీ వంటి పేరున్న ఉత్పత్తుల విక్రయాలను రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. వినియోగదారులకు ఏ సంస్థ అందించని రీతిలో 92.5 ప్యూర్ సిల్వర్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్నీ ఉత్పత్తులను దీని ద్వారా అందిస్తామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నీహార్ సంస్థల భాగస్వాములు, పలువురు సినీ, టీవీ కళాకారులు, ప్రముఖులు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.