బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ. ప్రపంచ వార్తలతో ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఇందులో డాక్యుమెంటరీలుగా ప్రదర్శిస్తారు. ఇక ఇందులో త్వరలో మన రాజధాని హైదరాబాద్ పై కూడా ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. బ్రిటీష్ పాలనలో హైదరాబాద్ స్టేట్ ఓ సామంత రాజ్యంగా ఉండేది. ఆ సమయంలో హైదరాబాద్ లో బ్రిటీష్ ప్రతినిధి క్రిక్ పాట్రిక్ వ్యవహరించాడు. ఆ సమయంలో ఆయనకు, రాజకుటుంబానికి చెందిన ఖైరున్నీసాకు మధ్య ప్రేమాయణం నడిచింది. ఖైరున్నీసా కోసం పాట్రిక్ ఇస్లాం మతం కూడా స్వీకరించాడు. వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, విధి మరోలా తలచింది. అప్పుడే ఇండియాకు గవర్నర్ జనరల్ గా వచ్చిన లార్డ్ వెల్లస్లీ పాట్రిక్ కు సమన్లు జారీచేశారు. ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లిచేసుకోవటంతోపాటు మరికొన్ని ఆరోపణలు కూడా రావటంతో పాట్రిక్ ను కోల్ కతా బదిలీ చేశారు. దీంతో అతను భార్యను విడిచి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇక కోల్ కతా వెళ్లాక పాట్రిక్ అనారోగ్యంతో మరణించాడు. మరికొద్ది కాలానికి భర్త దూరమైన బాధతో 27 ఏళ్లకే ఖైరున్నీసా కూడా తనువు చాలించింది. ఇక వారి పిల్లలను లండన్ లోని పాట్రిక్ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు బ్రిటీష్ పాలకులు. ఈ విషాద గాథనే డాక్యుమెంటరీగా బీబీసీ నిర్మించింది. అన్నట్లు ఈ డాక్యుమెంటరీ షూటింగ్ చార్మినార్, మక్కా మసీదు, మీరాలం మండి ప్రాంతాల్లో జరుపుకోవటం విశేషం.