మహిళల భద్రత కోసం షీ టీం లు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టే ఘటన. హైదరాబాద్ లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, క్రైమ్ రేట్ దారుణంగా తగ్గిపోయిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆ మధ్య అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడాయన స్టేట్ మెంట్ ను ప్రశ్నించే విధంగా ఓ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది.
ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 22న ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కూకట్ పల్లి దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి పారిపోయారు. ఇక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భావించిన సదరు యువతి, 25న నేరుగా మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో కేసు నమోదు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులను గుర్తించి పట్టుకోవాల్సిందిగా మాదాపూర్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు హైదరాబాద్ అంతా జల్లెడపట్టి నిందితులు నిజాంపేటకు చెందిన సంకు రమణ, కాసగోని రాజేష్, కిరణ్ లను అరెస్టు చేశారు. చివరికి వీరిని కోర్టులో హజరుపర్చగా అసలు విషయం బయటికి వచ్చింది.