హాస్టల్ లో చదివే రోజుల్లో పోస్టుమాన్ వచ్చేడంటే పండగే! అప్పుడు ఏటియమ్ వగైరాలేవు. మని ఆర్డర్ తో వచ్చే పోస్ట్ మాన్ అంటే సాక్షాత్తూ ధనలక్ష్మి పెనిమిటిలా కనిపించేవాడు. ఇక కార్డులు ఇన్ లాండ్ కవర్లు, కవర్లు ఏ శుభవార్త మోసుకొచ్చేయో అని అదుర్దా. ఒక్క టెలిగ్రాం అంటేనే హడల్... ఫలానావారు సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ! ఇందులో నిజం టెలిగ్రాములూ, ఇప్పించుకునే దొంగవీ ఉండేవి. ఈ ముచ్చట్లకు నూకలు చెల్లిపోయేయి. పోస్టలు డిపార్టుమెంటే అటకెక్కే రోజులివి.
తపాలాశాఖా డాక్ సేవా అవార్డుల సందర్భంగా మన మాజీ సూపర్ కాప్ అయిన గవర్నరు తన సోదరుడు వ్రాసిన ఉత్తరాన్ని ఈ రోజుకీ భద్రపరచుకున్న వైనాన్ని వివరించేరు. దురదృష్టమేమంటే ఆయన వ్రాసింది అదే కడసారి ఉత్తరమైంది. అస్సాం ట్రైనింగులో ఉండగా సోదరుడు వ్రాసిన తరుణంలో బాంబు ప్రేలుళ్లు అతనినిన బలిగొన్నాయి. అది ప్రస్తావిస్తూ గవర్నరు కన్నీళ్ల పర్యంతమయ్యేరు. ఇటువంటి హృదయగత అనుభూతులన్నీ మటుమాయమయిపోతున్నాయి. ఈమెయిళ్లో, ఎస్ఎంఎస్ లు దాపురించి తపాలశాఖను భ్రష్ఠుపట్టించేయి. ఆ శాఖా మానవసంబంధాలను పటిష్టపరిచే వారధిలా ఉండేది అంటూ గతం నెమరువేసుకున్న నరసింహన్ తాను కూడా ‘మానూమాకును కాదు, రాయిరప్పను కాదు, మాములు మనిషిని నేను’ అని తెలిపే ప్రయత్నం చేసేడు. ఇపుడిపుడే ఈ కామర్స్ పుణ్యమా అని పోస్టల్ డిపార్ట్ మెంటుకి ప్రాణవాయువు అందుతున్న సూచనలు అగుపిస్తున్నాయి.