మారేడ్ పల్లి పీఎస్ పై స్థానికుల దాడి

August 04, 2015 | 11:23 AM | 3 Views
ప్రింట్ కామెంట్
west_marredpally_police_station_attack_niharonline

హైదరాబాద్ నట్టనడిబోడ్డున ఉన్న పోలీస్ స్టేషన్ పై అర్థరాత్రి జరిగిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వెస్ట్ మారేడ్ పల్లి లోని పోలీస్ స్టేషన్ పై సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. పోలీస్ స్టేషన్ పై దాడితోపాటు ఫర్నీచర్ ధ్వంసం, వాహనాలను తగలబెట్టడంతోపాటు విధులు నిర్వహిస్తున్న ఎస్సైతోసహా నలుగురు కానిస్టేబుళ్లపై దాదాపు 200 మంది స్థానికులు దాడి చేశారు. వివరాళ్లోకి వెళ్లితే... బోనాల సందర్భంగా విధులు నిర్వహించేందుకు కరీంనగర్ కు చెందిన ఓ హోంగార్డు వెస్ట్ మారేడ్ పల్లిలోని గాంధీనగర్ కు వచ్చాడు. తనపై బన్నప్ప అనే ఆటో డ్రైవర్ దాడి చేశాడని ఆ హోంగార్డు వెస్ట్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో మారేడ్ పల్లి పోలీసులు బన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని బంధువులు సోమవారం అతన్ని విడిపించారు. అనంతరం ఇంటికి వెళ్లిన అతను కాసేపటికే సృహ కోల్పోయాడు. ఆర్ఎంపీ వైద్యుడి సలహా మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో అతను చనిపోయాడు. దీంతో అతని బంధువులు మృతదేహంతో స్టేషన్ ముందు బయట బైఠాయించారు.

ఇక కాసేపటికి ఆగ్రహాంతో ఊగిపోయిన స్థానికులు స్టేషన్ పై దాడికి దిగారు. కానిస్టేబుళ్లను ఎస్సైను చితకబాదారు. పక్కనే ఉన్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ను విరగొట్టారు. నిప్పటించారు. బోనాల బందోబస్తుకు సిబ్బంది వెళ్లిపోవటంతో..  స్టేషన్ లో నలుగురైదుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఉన్న ఎస్ ఐ లపై దాడి చేసి గాయపర్చినట్లుగా చెబుతున్నారు. పక్క పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చే సరికి.. స్టేషన్ పై దాడికి దిగిన వారంతా పరారైనట్లు చెబుతున్నారు.  ఈ హడావుడిలో స్టేషన్ లోని ఆయుధాలు పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. అలాంటిదేమీ లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ దాడి సమయంలో నిందితులు తెలివిగా వ్యవహరించి.. సీసీ కెమేరా ఫుటేజ్ బాక్స్ ను కూడా తమతో తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దాడి చేసిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తప్పు ఎవరిదైనా వదిలే ప్రసక్తే లేదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ