తెలంగాణ అసెంబ్లీలో పార్టీ చాంబర్ల కేటాయింపుల వ్యవహారంలో టీటీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి హరీష్ రావు ధీటైన సమాధానమిచ్చాడు. శాసనసభ ఆవరణలో తమకు ప్రత్యేక గది కావాలని, వెంటనే ఇవ్వకుంటే శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఛాంబర్ కు ఆయన పేరున్న బోర్డు తొలగించి మరో బోర్డు పెడతాం అని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనికి హరీష్ రావు స్పందిస్తూ... ఉమ్మడి రాజధాని నేపథ్యంలో ఒకే ప్రాంగణంలోని భవనాలను రెండు రాష్ట్రాలు పంచుకున్న పరిస్థితుల మూలంగా ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ టీడీపీకి 104, 105 గదులు కేటాయించామని చెప్పారు. బీఎస్పీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గదులు లేకపోవడంతో వారికి ఆదర్శనగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గదులు కేటాయించామని వివరించారు. ఇలాంటి పరిస్థతుల్లో సర్దుకుపోవాలని ఒకవైపు సున్నితంగా చెబుతూనే... మరో పక్క నా గదికి వారు బోర్డు పెట్టి చూస్తే ఏం జరుగుతుందో అప్పుడు చూపిస్తానని ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అధికార పక్షాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా ఘాటు విమర్శలు చేస్తున్న టీటీడీపీ నేతలకు ప్రభుత్వం తరపు నుంచి అదే రేంజ్ లో పంచ్ లు పడుతూనే ఉన్నాయి.