చైన్ స్నాచర్లు అసలు మనుషులేనా?

April 06, 2016 | 03:35 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Chain_Snatching_neredmet_baby_died_niharonline

పోలీసులు గట్టిగా భద్రతను పెంచటంతో కాస్త సైలెంట్ అయిన చైన్ స్నాచర్లు మళ్లీ పేట్రేగిపోతున్నారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి జంకిన ముఠా సభ్యులు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి మృగాల్లా మారి దాడులు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయారు. వీరి దాడిలో అభం శుభం తెలియని 25 రోజుల పసికందు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.

నేరేడ్ మెట్ లో రోడ్డుమీద ఓ మహిళ చేతిలో పసికందుతో వెళ్తుంది. ఒంటరిగా ఉండటంతో అదును చూసిన చైన్ స్నాచర్లు ఆమెపై దాడి చేశారు. గొలుసు వెంటనే తెగకపోవడంతో, బాధితురాలు కేకలు పెడుతూ, ప్రతిఘటించింది. అయితే బలవంతంగా ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకు వెళ్లేందుకు యత్నించగా, పెనుగులాటలో చేతిలోని బిడ్డ కిందపడింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆ చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పసికందు దేహం వద్ద ఆ తల్లి రోదనను చూసి పోలీసులు సైతం కంటతడి పెట్టడం గమనార్హం. అయితే మహిళ మెడపై కత్తి గాటు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగలను లాక్కెళ్లే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందా..? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ