బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రామ్ శంకర్ ఖతేరియాలతో ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్ బెర్త్లు దక్కిచుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. దీంతో మొత్తం కలుపుకుని 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జీ.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి కసరత్తు చేస్తోందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ నుంచి పీ.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.