సినీ పరిశ్రమ తెలంగాణాను వదిలి వెళ్ళిపోవాలని ఉద్యమం చేస్తున్నప్పుడుగానీ, తరువాత గానీ ఎవరూ అనలేదనీ ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం సినీ పరిశ్రమకు రాయితీలిచ్చి అభివృద్ధి చేయాలనీ, భవిష్యత్తులో మరిన్ని స్టూడియోలకు అవకాశం కల్పించాలనీ, తెలంగాణాలో సినీ పరిశ్రమ మరింత అభి వృద్ధి చేయాలని ఆయన కోరారు. ఇక్కడ చిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందించాల్సిన అవసరం ఉందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కు అవకాశం కల్పించాలన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణపై ఉన్న వివక్ష పూర్తిగా తొలగిపోయే వరకు పోరాటాలు కొనసాగిస్తూనే ఉండాలని ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ సూచించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.