అలకవీడినా డుమ్మా కొట్టారే

December 16, 2014 | 12:22 PM | 22 Views
ప్రింట్ కామెంట్

మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కొండా సురేఖలు తెలంగాణ కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ సహా ఆయన కేబినెట్ లోని మంత్రులు (దుబాయ్ పర్యటనలో ఉన్న కేటీఆర్ మినహా) అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత కేకే సహా, పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు లేదని తెలిసిన నేపథ్యంలో అలకపాన్పునెక్కిన కొప్పుల ఈశ్వర్, బెట్టు వీడినా మంత్రుల ప్రమాణానికి మాత్రం డుమ్మా కొట్టారు. తద్వారా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తనకు ఆమోదయోగ్యంకాదని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ కూడా మంత్రివర్గ విస్తరణకు హాజరు కాలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ కేబినెట్ లో మహిళకు స్థానం లేని నేపథ్యంలో తనకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కుతుందని ఆమె ఆశించారు. అంతేగాక, గడచిన ఎన్నికలకు ముందు కేసీఆర్ నుంచి కీలక హామీలు తీసుకున్న మీదటే పార్టీ మారారన్న వార్తలు వినవచ్చాయి. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు బెర్తు ఖాయమన్న వాదన కూడా వినిపించింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్, కొండా సురేఖకు మొండిచేయి చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె నేటి మంత్రివర్గ విస్తరణకు హాజరుకాలేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ