తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన ప్రస్తుతం మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. మంగళవారం ఉదయం ఎస్ ఆర్ నగర్ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి ఆజాత శత్రువుగా పేరుంది. ఆయన నారాయణ్ ఖేడ్ మండలంలోని పంచ గ్రామంలో జన్మించారు. ఆయన బావ దివంగత కాంగ్రెస్ నేత రాజకీయ ఉద్దండుడు అయిన బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989,99,2009,2014 నాలుగుసార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. కిష్టారెడ్డి ప్రస్తుతం తెలంగాణ పీఏసీ చైర్మన్ గా కూడా ఉన్నారు.
టీడీపీ హయాంలో రెండుసార్లు పీఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా అనేక పదువులు నిర్వహించారు. 2014లో తెలంగాణ వ్యాప్తంగా తెరాస గాలి వీచినా ఆయన గెలిచారంటే ఆయన ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. మృదుస్వభావిగా ఆయనకు పేరుంది. ఆయన మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.