వారిద్దరికి పెళ్లి సెటిలయ్యింది. అతడో తాగుబోతు. దీంతో ఓ యువతి అతనితో పెళ్లి వద్దనుకుంది. ఇక కోపం పెంచుకున్న ఆ యువకుడు ఏకంగా యువతినే కిడ్నాప్ చేయాలని ప్రయత్నించాడు. సినీ ఫక్కీలో జరిగిన ఛేజ్ లో చివరకు పోలీసులు నిందితులను పట్టకోగలిగారు. హైదరాబాద్ కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వరం కాలనీలోని ఓ యువతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఆ యువతికి ఇటీవలె ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయితే అతనో తాగుబోతు అని యువతి తల్లిదండ్రులకు తెలియడంతో సంబంధం రద్దు చేశారు. దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి యువతి కిడ్నాప్ కు యత్నించాడు. శనివారం ఉదయం ఇంట్లో పనిచేసుకుంటున్న యువతిని బలవంతంగా ఇండికా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానిక యువకులు వీరిని వెంబండించి దారిలో పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగడం ఇక పోలీసుల వంతు అయ్యింది. ఇక అక్కడి నుంచి ఛేజింగ్ యాక్షన్ సినిమాను తలపించింది. దారిలో నిందితులు బారికేడ్లను బద్ధలు కొట్టి పోవటం, విషయం తెలిసి యువతిని తీసుకోని షేరింగ్ ఆటోలో వెళ్లటం. ఇలా కిడ్నాపర్ లు అతితెలివిని ప్రదర్శించారు. అయినప్పటికీ, పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. అయితే, ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన యువకుడు మాత్రం పరారయ్యాడు.