రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కామేపల్లి, కారేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సత్తుపల్లిలో జరిగిన అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో జిల్లా అభివృద్ధిని కాంక్షించి టీఆర్‌ఎస్‌లో చేరాననీ, తనను గౌరవించిన ప్రజలకు సేవకుడిగా.. పాలేరులా పని చేస్తానని అన్నారు. 32 సంవత్సరాల తర రాజకీయ జీవితంలో తన వెన్నంటి ఉన్న ప్రజలకు తెలంగాణా అభివృద్ధి ఫలాలు అందిస్తానని అన్నారు. జిల్లాలోని పాల్వంచ, మణుగూరులో నిర్మించనున్న థర్మల్ పవర్‌ప్లాంట్ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తానని తుమ్మల చెప్పారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులతో తెలంగాణకు రవాణా సంబంధాలు పెంపొందించి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా చూస్తామనీ, 44వేల చెరువులను బాగుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రహదారులు లేని గ్రామాలు ఇకపై ఉండవన్నారు. బయ్యారం ఖనిజాలతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించి తీరుతామన్నారు.