అనూహ్యంగా తెలంగాణ డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తప్పించటం, ఆ స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని తీసుకోవటం. ఆ వెంటనే ఆయనగారికి విద్యాశాఖతోపాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. వైద్యశాఖలో జరిగిన అవకతవకల కారణంగానే రాజయ్యను తొలగించినట్లు, అంతేకాదు ఆయనపై విచారణ కమిటీని నియమించినట్లు స్వయానా సీఎం కేసీఆరే ప్రకటించారు. అయితే ఈ తొలగింపు వెనుక పెద్ద రాజకీయ గూడుపుఠాణి నడుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే... ఢిల్లీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఎలాగూ చేరాక మంత్రి పదవుల పంపకం ఉంటుంది. అందుకుగానూ తన కుమార్తె అయిన కవితను ప్రతిపాదించాలని కేసీఆర్ అనుకున్నారట. ఆ జాబితాలో కవిత కంటే ముందున్న నేత కడియమే. సీనియర్ ని కాదని ఆమెకు మంత్రి పదవి దక్కితే విమర్శలకు గురయ్యే అవకాశం ఉండటంతో ముందుగా ఆయనను రాష్ట్రానికి రప్పించి ఆమెకు మార్గం సులువు చేశారట. ఇందులో భాగంగానే మొదట నుంచి విమర్శలు ఉన్న రాజయ్యను పక్కబెట్టేశారు. ఏదేమైనా ఈ రాజకీయ చదరంగంలో బలైంది మాత్రం రాజయ్యే.