ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి ఈ మధ్యే కారెక్కిన ఎమ్మెల్యేలకు ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ లు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ద్రవ్య వినిమయ బిల్లును అవకాశంగా ఉపయోగించుకోనున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్, టీడీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిరాయింపులపై గవర్నర్ తోసహా స్పీకర్ కు ఫిర్యాదు చేసిన లాభం లేకపోవడంతో ఫిరాయింపుదారులపై రివెంజ్ తీర్చుకునేందుకు దీనిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేశాయి. దీంతో వారు ఆయా పార్టీల తరపునుంచి తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనాలి. ఒకవేళ ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్లయితే న్యాయస్థానంలో వారి అనర్హత పై వాదించేందుకు ఆయా పార్టీలకు మంచి పాయింట్ దొరికినట్లవుతుంది. సాధారణంగా ద్రవ్య వినిమయ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించవు, కానీ ఫిరాయింపుదారులపై చర్యల కోసం ఈ సారి విపక్షాలు ఓటింగ్ ను కోరుతున్నాయి.