ఫిలింఛాంబర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గురువారం సినీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో అగ్ర హీరోల చిత్రాలతో సహా పలు చిన్న చిత్రాల షూటింగ్ లకు కూడా నిలిచిపోయాయి. మొత్తం 24 విభాగాలలోని కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె చేస్తామన్న విషయాన్ని ఇదివరకే ఫిలింఛాంబర్ కు తెలిపామని, అయినా ఎలాంటి స్పందన లేదని చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు కొమర వెంకటేశ్ వెల్లడించారు. వేతనాల విషయంలో చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరడం, ఫెడరేషన్ సభ్యులు కాని వారితోనైనా పని చేయించుకునే హక్కు నిర్మాతలకుంటూ ఫిలింఛాంబర్ పేర్కొనటం సరికాదని ఆయన తెలిపారు. చిన్న చిత్రాలకైనా, పెద్ద చిత్రాలకైనా కార్మికుల కష్టం ఒకటే. చిన్న చిత్రాలను తక్కువ రోజుల్లో పూర్తి చేయాల్సి రావటంతో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని, ఆ విధంగా చిన్న చిత్రాలకే ఎక్కువ కష్టం ఉంటుంది. నిబంధనల ప్రకారం కోటి రూపాయల్లోపు తీసేవి మాత్రమే చిన్న చిత్రాలు. కానీ, మూడు నుంచి ఐదు కోట్ల లోపు నిర్మించే వాటిని కూడా చిన్న చిత్రాలుగా పరిగణిస్తున్నారు. అది సరికాదు. సభ్యుల కానివారితో కూడా పని చేయించుకోవాలనుకున్నప్పుడు కార్మికులతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఎందుకు? ఫెడరేషన్ సభ్యత్వం గల 24 శాఖల్లోని వారినే తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనిపై ఫెడరేషన్ తో సినీపెద్దలు ఛాంబర్ లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక కార్మికుల సమ్మెతో బాహుబలి, గోపాల గోపాల, కిక్-2 చిత్రాలతోపాటు బాలకృష్ణ, అల్లు అర్జున్ చిత్రాల షూటింగ్ కూడా ఆగిపోయింది.