టీచర్ అనే పదానికి విలువ లేకుండా చేసిన ఓ మృగానికి విద్యార్థుల తల్లిదండ్రులంతా కలిసి చేసిన బడిత పూజ. చిన్నారులనే కనికరం లేకుండా కన్ను మిన్ను తెలియకుండా రెచ్చిపోతే ఎలా ఉంటుంది. తమకు ఏదో చదువు చెప్పి.. బాగు చేస్తాడని అనుకున్న టీచర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. తమ పిల్లలను బడికి పంపించి.. ఉన్నత చదువులు చదివిద్దామని అనుకున్న తల్లిదండ్రులకు.. తమ పిల్లలతో టీచర్ నీచంగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది. వెరసి విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ వెకిలి చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది. బండకేసి బాదటం తప్పా. ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లా లో చోటుచేసుకుంది.
తిమ్మాపూర్ ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఓ టీచర్ నిర్వాకానికి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను నడి వీధిలో ఉతికారేశారు. గత కొంత కాలంగా తమను వేధిస్తున్నాడని, లైంగికంగా కూడా వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు తమ తల్లిదండ్రుల వద్ద తమ బాధను వెల్లడించారు. అయితే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్కూల్ లో ఉన్న టీచర్ ను బయటకు లాగి రోడ్డు మీద దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కీచక టీచర్ ను వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.