తెలంగాణ ప్రసిద్ధ దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ప్రధాన ఆలయం మూత పడింది. యాదాద్రి పేరిట వందకోట్లతో అభివృద్ధికి తెరతీసిన కేసీఆర్ సర్కారు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ను సంసిద్ధం చేసింది. ఈ క్రమంలో త్వరలోనే పనులు ఊపందుకోనున్నాయి. ఈ అభివృద్ది పనుల నిర్వహణ కోసమే యాదాద్రి ప్రధాన ఆలయాన్ని బుధవారం మూసేశారు. అయితే సెలవులు కావటం, పైగా భక్తుల రద్దీ ఎక్కవ ఉండటంతో లక్ష్మీనరసింహుడి దర్శనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే రూపుదిద్దుకున్న బాలాలయం త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. గుట్టపై అభివృద్ది పనులు ముగిసేదాకా యాదగిరీశుడిని భక్తులు బాలాలయంలోనే దర్శించుకోవాల్సి ఉంది. యాదాద్రి ప్రధాన ఆలయాన్ని మూసేసిన నేపథ్యంలో బుధవారం లక్షల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం రీతిలో ఈ ఆలయాన్ని రూపుదిద్దాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన.