బాహుబలి-2 సంచలనాలకు తెరలేపబోతుంది. మొదటి పార్ట్ 600 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల కింగ్ గా నిలవగా, రెండో పార్ట్ కోసం ఇప్పటికే బేరాలు మొదలయ్యాయి. హిందీ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 150 కోట్లను ఆఫర్ చేసిందట. ఇప్పుడు ఇదే వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. 'బాహుబలి' సినిమా విడుదలైన ప్రతి భాషలోను విజయవిహారం చేసింది. హిందీలో కూడా ఈ సినిమా 100 కోట్లను కొల్లగొట్టి తన సత్తా చాటుకుంది.
మొదటిభాగానికి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమా బిజినెస్ చేయడానికి నిర్మాతలు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హిందీ రైట్స్ ను తమకి ఇవ్వమంటూ బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కోరుతోందట. శాటిలైట్ రైట్స్ ను కూడా కలుపుకుని 150 కోట్లను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కూడా కరణ్ జోహార్ కే హిందీ రైట్స్ ఇవ్వాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నారని అంటున్నారు. ఒక వేళ 150 కోట్ల డీల్ కుదిరితే మాత్రం, దక్షిణ భారతదేశంలో అత్యధిక ధర పలికిన అనువాద చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.