వారిద్దరు మంచి స్నేహితులు. ఒకరు టాప్ హీరో, మరోకరు స్టార్ కమెడియన్. ఇద్దరు కలిసి అనేక హిట్ మూవీల్లో నటించారు కూడా. ఈ క్రమంలో ఆ కమెడియన్ ఆ స్టార్ హీరోతో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. అది కాస్త కుదరకపోవటంతో ఏకంగా ఆ హీరో ఫ్యామిలీ నుంచి ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట.
కన్నడ సినీ హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కన్నడ స్టార్ హీరో అయిన దర్శన్ సోదరుడు దినకర్ తూగదీప్ తనను చంపేస్తానని బెదిరించాడని ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు దినకర్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. తన కుమార్తె సమక్షంలోనే ఆయన ఇలా బెదిరించాడని, అందుకు తన కూతురే సాక్షి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రకాశ్ వివరించాడు. తనపట్ల మరీ నీచంగా ప్రవర్తించాడని, అంతేగాక తన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని దర్శన్ అనుచరులు వేధిస్తున్నారని తెలిపాడు.
దర్శన్ తో ఓ సినిమా నిర్మిస్తానని ఆ మధ్య ప్రకాశ్ ప్రకటించాడు. ఏమైందోగానీ ఆ ప్రయత్నం కుదరలేదు. అయితే, దర్శన్ సోదరుడు దినకర్, ప్రకాశ్ కు మాత్రం వాటి గురించే విభేదాలు వచ్చాయి. దాంతో గొడవ మరింత పెద్దదై బెదిరింపులు చేసుకునే స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది.