అమీర్ ఖాన్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. ఓ సామాజిక కార్యకర్త ‘సత్యమేవ జయతే’ నిర్మాతలైన అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావులకు, ఈ టీవీ షోకు డైరెక్టర్ అయిన సత్యజిత్ భత్కల్ కు లీగల్ నోటీసు పంపాడు. ఈ షోలో అమీర్ ఖాన్ భారత దేశ చిహ్నమైన మూడు సింహాలను వాడుకోవడాన్ని ఆయన తప్పు బట్టారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా జాతీయ గుర్తును, ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని కూడా వాడుకోగూడదంటున్నారు. సత్యమేవ జయతే అనేది కూడా నేషనల్ ఎంబ్లమ్ లో ఒక భాగమేనని ఆ సామాజిక కార్యకర్త మనోహరన్ జాన్ రాయ్ అంటున్నారు. ఈ నోటీసును ఆయన అడ్వకేట్ మనోజ్ సింగ్ ద్వారా పంపించారు. 2009 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అనుమతి లేకుండా సత్యమేవ జయతే అనే పదాన్ని వాడుకోకూడదంటున్నారు. ఈ లీగల్ నోటీసుపై అమీర్ ఖాన్, ఈ ప్రోగ్రామ్ మేనేజర్లు ఎలా స్పందించనున్నారో వెయిట్ చేయాల్సిందే...