శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై 'ఆదిత్య' క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జాతీయ అంతర్జాతీయ అవార్డు పోటీలో ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు పొంది, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల నుండి వినోద పన్ను మినహాయింపు ఇవ్వబడింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ "ఈ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ ఐ.ఏ.ఎస్.ఆఫీసర్స్ మంచి కథాంశంతో సినిమాను రూపొందించారని ప్రశంసించారు. బాలల చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రముఖులచే ప్రశంసలు పొంది, జాతీయ, ప్రాంతీయ బాలల అభ్యున్నత సంస్థల యొక్క మన్ననలు పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వినోదపు పన్ను మినహాయింపు పొందింది. ఈ చిత్రంలో నటించిన బాలనటులు అధ్బుతమైన నటనను కనబరిచారు. ఇది బాలల చిత్రమైనా హాస్యభరితంగా ఉండటం కొరకు బ్రహ్మానందం, స్వర్గీయ ఎమ్.ఎస్.నారాయణలతో హాస్యాన్ని పండించాం. అభ్యుదయవాది పాత్రలో సుమన్, ప్రతినాయకుడి పాత్రలో ఆశిష్ విద్యార్ధి, విప్లవాత్మక పాత్రలో శివపార్వతి నటించారు. ప్రధాన బాలనటుడి పాత్రలో 'ప్రేమ్ బాబు' అధ్బుతమైన నటనను ప్రదర్శించాడు.ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాహిచడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని జూన్ 3వ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని చెప్పారు. శ్రీ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ "సినిమాను బాగా చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో బాలల చిత్రాలు తీయడం మానేసి కమర్షియల్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో సుధాకర్ గారు ఎంతో సాహసోపేతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారుగా రెండువేల మంది పిల్లలు ఈ సినిమాలో నటించారు. సుధాకర్ గారు సినిమాను నిర్మించడమే కాకుండా సైంటిస్ట్ పాత్రలో కూడా నటించారు. సమాజంలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ కార్పోరేట్ స్కూల్ విద్యార్థులతో పోటీపడి సైన్స్ అండ్ టెక్నాలజీలో అధ్బుతమైన ప్రతిభను కనబర్చిన ఆదిత్య అనే అనాధ బాలుడిపై నడిచే కథ ఇది" అని అన్నారు. ప్రేమ్ బాబు మాట్లాడుతూ "ఈ సినిమాలో 'ఆదిత్య' టైటిల్ రోల్ లో నటించాను. మంచి సందేశాత్మక చిత్రమిది" అని చెప్పారు.ఇంకా ఈ చిత్రం లో నటించిన బాల బాలికలు మాట్లాడారు. ముందుగా ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను పాటలను ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శంకర్ కంతేటి, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం, సాహిత్యం: బండారు దానయ్య కవి, రీరికార్డింగ్: వందేమాతరం శ్రీనివాస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -నిర్మాత, దర్శకత్వం: భీమగాని సుధాకర్ గౌడ్.