బర్త్ డే స్పెషల్: అట్లూరి పుండరీకాక్షయ్య

August 19, 2015 | 12:07 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Atluri_pundarikakshayya_birthday_special_niharonline

అట్లూరి పుండరీకాక్షయ్య తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాలో ‘ముద్దుకృష్ణ’గా విలన్‌ పాత్రలో మెప్పించింది ఆయనే.  నిర్మాతగా మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి హిట్ చిత్రాలను అందించాడు. మధురగాయకుడు మహమ్మద్ రఫీని భలే తమ్ముడు చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేశాడు.  ఈరోజు (ఆగష్టు 19న) ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి...

                  పుండరీకాక్షయ్య కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925 లో జన్మించారు. తర్వాత తండ్రికి బెజవాడ కు ట్రాన్స్ ఫర్ కావటంతో అక్కడికి మకాం మార్చారు. తండ్రికి సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో 8వ తరగతిలో చదువు ఆపేశాడు. మొదటగా ప్రహ్లాద సినిమాలో మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఆయనకు స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" ను స్థాపించి నాటకాలు వేసేవారు. 1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అక్కడ విజయా సంస్థలో పనిలో చేరాడు. అనంతరం సహచరుడు త్రివిక్రమ రావు తో కలిసి నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై పిచ్చి పుల్లయ్య అనే సినిమా నిర్మించాడు. అందులో పుండరీకాక్షయ్య ఒక పాట పాడటం విశేషం. తరువాత వహీదా రెహమాన్ కథానాయికగా జయసింహ అనే సినిమా తీశారు. ఆ తర్వాత రేచుక్క పగటి చుక్క, పాండురంగ మహాత్యం, సీతారామకళ్యాణం మొదలైన సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా పని చేశాడు. సీతారామ కళ్యాణం విడుదల సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. అదే సమయంలో ఆయన చదివిన అప్పాజీ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా గుమ్మడి కి బాగా పేరు తెచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ నుండి రజత పతకం కూడా లభించింది.

                                                1990 కర్తవ్యం సినిమా ద్వారా విలన్ గా తిరిగి తెర మీద కనిపించారు. తొలుత ఒప్పుకోకపోయినా పరుచూరి బ్రదర్స్ , నిర్మాత ఏ.యం. రత్నం,  దర్శకుడు మోహన గాంధీ అంతా కలిసి బలవంతంగా ఆయనను పాత్రకు ఒఫ్పించారు. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ జనాలకు గుర్తుండిపోయింది. పైకి సాప్ట్ గా కనిపించి, లోపల క్రూరంగా ఉండే పాత్రలో పుండరీ పాత్ర అద్భుతంగా పేలింది. ఆ తర్వాత శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు మరియు 5 కన్నడ సినిమాల్లో నటించాడు. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది. ఫిబ్రవరి 2, 2012 లో పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ