తెలుగు చలన చిత్ర చరిత్ర... కాదు, కాదు మొత్తం భారత చలన చిత్ర రికార్డులను తిరగరాసింది రాజమౌళి బాహుబలి. బహుశా ఇది ఇంత పెద్ద చిత్రం అవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డులు సృష్టించి విదేశాల్లోని పలు భాషల్లో కూడా అనువాదమై అక్కడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విదేశాల్లోని పలు ప్రముఖ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలికి స్టాడింగ్ ఒవేషన్ ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు యూరప్ లో కూడా బాహుబలి మేనియా చూపిస్తోంది.
ఆ చిత్ర ప్రదర్శన హక్కులను దక్కించుకునేందుకు యూరప్ ఖండంలోని దేశాల డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఈ చిత్రం హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా యూరోపియన్ డిస్ట్రిబ్యూటర్ పెర్రీ అసోలియన్ మాట్లాడుతూ, భారతీయ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతుండటం ఇక్కడి సినీ పరిశ్రమకు శుభ పరిణామమన్నారు. కాగా, చైనా, లాటిన్ అమెరికాల్లో బాహుబలి చిత్రం హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయాయి. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పార్ట్-2 కూడా త్వరలో తెరకెక్కనుంది. మరి దాని బిజినెస్ ఇంకెంత భారీగా జరుగుతుందో మరి.