‘బాహుబలి' చిత్రం ఇప్పటి వరకూ ఇండియా మొత్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఓ చరిత్ర సృష్టించబోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో ఏ సినిమా విడుదల కానన్నికాని థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలవుతోంది. సినిమా ఇప్పటికే అంచనాలకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని థియేటర్లలో అడ్వాన్డ్స్ బుకింగ్ ఇస్తున్నారు. టికెట్స్ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు కనీసం 15 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర ఏరియాల్లో 5 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా. ఇక యుఎస్ బాక్సాఫీసు వద్ద 800k నుండి 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా. మరో వైపు ఈ చిత్రానికి కర్ణాటకలో రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో అక్కడ వసూళ్లు భారీగానే ఉండొచ్చని అంటున్నారు. సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే, తొలి వారం 65 కోట్ల వసూలు చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం గత రికార్డులను, అంచనాలను బద్దలు కొడుతూ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.