కలకలం రేపిన బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో విచారణ వేగవంతమైంది. శుక్రవారం సాయంత్రం ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో ప్రత్యూష చనిపోయింది. ప్రేమ ఉదంతమే ఈ దారుణానికి కారణమని అంతా భావిస్తున్నారు. జంషెడ్ పూర్ కు చెందిన ప్రత్యూషా బెనర్జీ అతి కొద్ది సమయంలోనే యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకొంది. టీవీ ప్రొడ్యూసర్ అయిన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
చివరి వాట్సాప్ సందేశంలోనూ.. ‘మరణం తరువాత కూడా నీ నుంచి ముఖం తిప్పడంలేదు’ అని ఒక స్మైలీతో పాటు ఉంది. ఈ క్రమంలో అడ్రెస్ లేకుండాపోయిన రాహుల్ ను శనివారం ఉదయం ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పరిశీలించిన ఆమె మిత్రులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష ముఖంపై గాయాలున్నాయని పేర్కొన్న వారు ఆమెను పక్కాగా వేసిన ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆరోపించారు. మరికాసేపట్లో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే... ఆమెది హత్యా?, ఆత్మహత్యా? అన్న విషయం తెలిపోతుందని పోలీసులు చెబుతున్నారు.