ఓ స్టార్ సెలబ్రిటీ కేవలం ఒక ప్రెన్ డ్రైవ్ కోసం అంతలా ఆత్రుతపడటం ఏంటి? అసలు అందులో ఏం ఉంది? గత మూడు వారాలుగా మీడియాలో హాట్ హాట్ గా హల్ చల్ చేస్తున్న న్యూస్ ఇది. సీనియర్ నటి రాధాప్రశాంతి తన పెన్ డ్రైవ్ ఒకటి మిస్సయ్యిందని పోలీస్ కేసు పెట్టడంతో అసలు సంగతి ఏంటా అని ఆరాలు తీయటం మీడియా వంతు అయ్యింది. ఈ విషయంలో తనపై లేనిపోని కథనాలు ప్రసారం కావటంతో హర్టయిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, కేవలం అది పెన్ డ్రైవ్ మాత్రమే కాదని, తన జీవితమని ఆమె చెప్పారు.
దాంట్లో తన, కుటుంబ సభ్యుల ఫోటోలు, విలువైన డాక్యుమెంట్ల వివరాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ ఫోటోలను ఎవరైనా మార్ఫింగ్ చేస్తే, డాక్యుమెంట్లను దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. సెలబ్రిటీని కావటం, పైగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటంతో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి మీ పేరిట ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేస్తామని చెప్పి, ఫోటోల కోసం ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్లాడని వివరించింది. వారం రోజులు గడుస్తున్న సదరు వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించానని, ఈ మాత్రం దానికే అందులో ఏవేవో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని చెప్పుకొచ్చింది రాష్ట్రపతి అవార్డు గ్రహీత కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.