టాలీవుడ్ లో మరో చిత్రం పాతికేళ్లు పూర్తి చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి జంటగా నటించిన పెళ్లి పుస్తకం చిత్రం ఈరోజుతో ఆ ఘనత సాధించింది. భార్యభర్తల అనుబంధాన్ని అపురూపంగా చూపిస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి సీనియర్ నటుడు రావికొండలరావు కథ అందించగా, ముళ్లపూడి వెంకటరమణ నిర్మాతగా వ్యవహరించటంతోపాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. దర్శకుడు బాపు తెరకెక్కించాడు. గుమ్మడి, రావికొండలరావు, శుభలేఖ సుధాకర్, సింధూజ, ఝాన్సీ, తదితరులు ప్రధాన తారాగణం.
క్లాసిక్ మూవీ మిస్సమ్మలోని ఓ పాయింట్ ను బేస్ గా చేసుకుని రమణ అల్లిన కథ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మిస్సమ్మలో ఉద్యోగం కోసం పెళ్లి కానీ జంట ఎన్టీఆర్, సావిత్రిలు పెళ్లయినట్లుగా నటిస్తే, ఇందులో కొత్తగా పెళ్లయిన జంట కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవటం కోసం పెళ్లికానీవారిగా నటించారు. భార్య భర్తల మధ్య ప్రేమతోపాటు, చిన్నపాటి గొడవలు, అలకలు, లాంటి ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ గా తెరకెక్కించాడు. కేవీ మహదేవన్ అందించిన స్వరాలు ఇప్పటికీ ఫేవరెట్ గానే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరస్తు శుభమస్తు పాట ప్రత్యేకం. ప్రతీ పెళ్లి సీడీలో అది ఖచ్ఛితంగా ఉండి తీరుతుంది.
1991 ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదలకాగా బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు ఆ ఏడాదిగానూ బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డును కూడా గెలుచుకుంది. పనోరమ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది.
ఒకళ్లనొకళ్లను ప్రేమించుకుంటూ, పాత్రలను ప్రేమిస్తూ చేసిన సినిమా ఇదని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బాపు-రమణలు బతికుంటే వారితో ఈ సక్సెస్ ఎంజాయ్ చేసేవాళ్లమని ఆయన తెలిపారు.
ఇంటిల్లిపాలిటిని అలరించిన ఈ చిత్రం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తుంది.