బాహుబలి మొత్తం మీద 300 కోట్లు వచ్చినా చాలనుకున్న వారికి ఈ మొత్తం పది రోజుల్లోపే రాబట్టింది అది కూడా ఒక్క పార్ట్ కే... ఇక బిగినింగ్ వసూళ్లే 300 దాటితే... రెండు పార్టులు కలిపితే ఎంత లాభాలు వసూలు చేస్తుందో ఊహించలేం... ప్రతి ఏరియాకు రికార్డు స్థాయిలో రైట్స్ తీసుకుంటుంటే.. అందరూ చాలా రిస్క్ తీసుకుంటున్నారనిపించింది. కానీ ఇప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటరూ భారీగా లాభాలు అందుకోవడం మొదలైంది. విడుదలైన పది రోజులకే మెజారిటీ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి వచ్చేసి... ఇక లాభాల బాటలో పడ్డారు. నైజాం ఏరియాకు రికార్డు స్థాయిలో రూ.22.5 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్న దిల్ రాజు 9వ రోజు పెట్టుబడి రాబట్టేసుకున్నాడు. ఇవి షేర్ వసూళ్లే కావడంతో ఆదివారమే రాజుకు లాభాల పంట మొదలైంది. ఇక బాహుబలిని థియేటర్ల నుంచి తీసేసే దాకా రాబట్టే ప్రతి పైసా రాజు జేబులోకి వెళ్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ముందు లాభాల్లోకి వచ్చింది రాయలసీమ ఏరియా. రూ.11 కోట్లకు రైట్స్ అమ్మితే తొలి వారానికే షేర్ ఆ మొత్తాన్ని దాటిపోయింది. ఆదివారానికి 3, 4 కోట్ల లాభంలో ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్. అయితే ఆంధ్రా ప్రాంతంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లందరూ లాభాల్లోకి ఇంకా రాలేదు. అక్కడ ఉత్తరాంధ్ర మినహా ఏకమొత్తంగా కాకుండా జిల్లా జిల్లాకు రైట్స్ అమ్మారు. సీడెడ్ నైజాం ఏరియాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు మరింత భారీగా ఉన్నాయి. నెల్లూరు (రూ.3.5 కోట్లు) కృష్ణా (రూ.5 కోట్లు) తూర్పు గోదావరి (రూ.5 కోట్లు) పశ్చిమ గోదావరి (రూ.4.5 కోట్లు) గుంటూరు (రూ.6.5 కోట్లు). ఈ ఏరియాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసినట్లే. కానీ ఇంకా లాభాలు మాత్రం రాలేదు. కర్నాటక ఓవర్సీస్ ఏరియాల్లో మాత్రం తెలుగు బిజినెస్ తో పోలిస్తే రెట్టింపు లాభాలు ఆర్జిస్తున్నారు.