మరో వర్థమాన నటి అర్థాంతరంగా తనువు చాలించింది. బాలీవుడ్ లో బీఏపాస్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిఖా జోషి కంఠం కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముంబై వెర్సోవా ప్రాంతంలోని తన అపార్ట్ మెంటు బాత్ రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. తన స్నేహితురాలు మధా ఫ్లాట్ లో ఉంటున్న ఆమె బాత్ రూం నుంచి ఎంతకీ రాకపోవటంతో స్నేహితురాలు చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్ధలు కొట్టి చూసింది. చికిత్స నిమిత్తం సమీపంలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే జోషి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. కాగా, ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవటం, లైంగిక వేధింపులు జరగడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.