అంటే సత్యరాజ్ లాగా చిరు కూడా కత్తి పట్టుకోవాలనే కోరికగా ఉన్నాడా ఏంటి? అనుకోకండి... బాహుబలి సినిమా చర్చలపై పడి ఏం మాట్లాడుకున్నా... ఆ సినిమా మధ్యలో వచ్చేస్తుంది. చిరుగానీ కత్తి యుద్ధాల సినిమాపై మనసు పడ్డాడా ఏమిటని... చిరంజీవి 150వ సినిమా కథ ఇంకా ఓ కొలిక్కి రానట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా కథలు విన్నాడు. ఎందరో స్టార్ డైరెక్టర్లు, స్టార్ రైటర్లు కథలు వినిపించారాయనకు. కానీ ఎవరూ చిరుని ఒప్పించలేకపోయారు. పూరి చెప్పిన `ఆటోజానీ` కథ మాత్రం సగం నచ్చింది. మరో సగం చేయమంటే వేరే సినిమాతో బిజీ అయిపోయాడు పూరి. మరి చిరు రీ ఎంట్రీ సినిమా సంగతేంటి? పోయిన పుట్టిన రోజు కే సినిమాని ప్రకటించాలనుకొన్నాడు. కానీ కుదర్లేదు.
మరో పది రోజుల్లో ఇంకో బర్త్ డే కూడా వచ్చేస్తోంది. కానీ కథ మాత్రం సిద్ధం కాలేదు. ఆ విషయంలోనే చిరు కాస్త ఆలోచనలో పడ్డాడట. అయితే ఇటీవలే ఎవరో వచ్చి `కత్తి` సినిమా చూడమని చిరుకి చెప్పారట. తమిళంలో విజయ్ కథానాయకుడిగా నటించిన `కత్తి` సినిమాని చూసిన చిరుకి చాలా బాగా నచ్చిందట. మురుగదాస్ తీసిన ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో పడ్డాడట ఇప్పుడు చిరంజీవి. ఈ విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. `కత్తి` సినిమాని తెలుగులో రీమేక్ చేయడం గురించి చాలా మంది హీరోలు ప్రయత్నించారు. ఈ సినిమా కోసం చాలా మంది హీరో పేర్లు వినిపించాయి. మొదట ఎన్టీఆర్... ఆ తర్వాత పవన్, మహేష్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ వాళ్లెవరూ ఆ సినిమాని చేయలేకపోయారు. ఇప్పుడు చిరు మాత్రం తనకు తగ్గట్టుగా కథలో కొంత మార్పులు చేస్తే బాగుంటుందనుకుంటున్నాడట. అంతా పక్కా అనుకొన్నాక మురుగదాస్ కి కబురు పెట్టి కథలో మార్పులు చేయించొచ్చని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మురుగదాస్ ఇదివరకు తమిళంలో తీసిన `రమణ` సినిమాని వినాయకే చిరుతో `ఠాగూర్`గా తీసి హిట్టు కొట్టాడు. అందుకే ఈ బాధ్యతను కూడా వినాయక్ కే అప్పగించాలనే ఆలోచనల్లో ఉన్నాడట మెగాస్టార్.