మెగా అభిమానులంతా చిరు 150 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, అటు నుంచి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉగాది తర్వాత సినిమా సెట్స్ పైకి వెళుతుందనే వార్త వచ్చినప్పటికీ, ఇప్పుడు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆరు నూరైనప్పటికీ మొదటి నుంచి తమిళ హిట్ కత్తి రీమేక్ అనే అనుకున్నారు. అంతే కాదు కత్తిలాంటోడు అనే టైటిల్ కూడా ఖరారైనట్లు అనుకున్నారు. అయితే 'కత్తి' రీమేక్ తో కాకుండా, కొత్త కథతో సినిమా తెరకెక్కనుందనేది టాక్. నిజానికి విజయ్ సమంత నటించిన కత్తి తెలుగులోనూ డబ్ అయ్యింది. అయితే, రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయటంతో విడుదల చేయకుండా దానిని పక్కనబెట్టారు. ఆపై కథను, తెలుగు నేటివిటికి తగిన విధంగా మార్చేసి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలని చిరంజీవి భావించాడు.
అయితే సెకండాఫ్ ఆశించిన స్థాయిలో రాకపోవటం, పైగా తెలుగు ప్రేక్షకులకి కోలీవుడ్ సినిమాలపై కూడా పట్టుఉండటంతో దానిని పక్కనపెట్టాలని వినాయక్ చెప్పాడంట. అంతేకాదు వినాయక్ మరో కథను వినిపించడం, అది 'కత్తి' కన్నా బాగుండటంతో, ఇదే 150వ సినిమాగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి మరికాస్త టైం పట్టినప్పటికీ, కొత్త కథ కావటంతో అభిమానులు కాస్త సంతోషించాల్సిన విషయమే.