రెగ్యులర్ మసాలాకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు తీసిన ప్రతిసారి ఓ వర్గపు జనాల్ని ఆకర్షించినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అవటం రెగ్యులర్ గా మనం చూస్తున్నదే. కథ, కథనం బలం ఉన్నప్పటికీ ఎందుకో అవి అంతగా ఆడవు. కానీ, అవార్డులలో మాత్రం వాటిదే ఎప్పుడూ పై చేయి ఉంటుంది. ఇది మరోసారి ఇప్పుడు నిరూపితమైంది.
చైనా అధీనంలో హాంకాంగ్ ఒక విషాదభరితమైన భవిష్యత్తును ఎదుర్కొంటుందంటూ ‘టెన్ ఇయర్స్’ అనే ఓ సినిమాను రూపొందించారు. బీజింగ్ అధీనంలో ఉన్న హాంకాంగ్ భవిష్యత్తులో ఎదుర్కొనే పొలిటికల్ గ్యాంగ్ లను, తమ మాతృభాష అయిన కాంటోనిస్ మాండలిక భాషను మాట్లాడుతుండడం వల్ల అక్కడి జనాలు హింసకు గురికావడాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. అయితే తమ దేశాన్ని ఓ నియంతలా ఛూపటంతో ఆ చిత్రం చైనాలో బ్యాన్ అయ్యింది.
కానీ హాంకాంగ్‌లో మాత్రం ఇది విజయవంతంగా ప్రదర్శితమై ఇప్పుడు అవార్డుల పంట పండిస్తోంది. అనూహ్యంగా ఆ సినిమా హాంకాంగ్ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఇప్పుడు ఆసియా టాప్ ఫిల్మ్ అవార్డుల్లో ఒక దానిని సొంతం చేసుకుంది కూడా. లో బడ్జెట్‌తో చిత్రీకరించిన ఈ మూవీ ఇటీవలే ఈ అవార్డు అందుకొని అందరి ప్రశంసలూ పొందుతోంది.